28, ఫిబ్రవరి 2011, సోమవారం

లినక్స్ లో టైపింగ్ పద్ధతులు

లినక్స్ లోటైపింగు మూడు విధాలుగా సాధ్యం.
  1. ఐబస్ ప్రాధాన్యతలు
  2. కీబోర్డు అమరికలు
  3. SCIM ఇన్పుట్ పద్ధతి
ఈ మూడు పద్ధతుల ద్వారా లినక్స్ లో టైపింగు చెయ్యవచ్చు.ఐబస్ మరియు SCIM పద్ధతులలో ఇన్‌స్క్రిప్ట్ తో పాటు ఇతర కీ బోర్డు లే అవుట్ మోడళ్ళు(ఆపిల్,ఐట్రాన్స్,పోతన,rts) కూడా ఉంటాయి.కీబోర్డు పద్ధతిలో మాత్రం కేవలం ఇన్‌స్క్రిప్ట్ మాత్రమే ఉంటుంది.ఇది అప్రమేయంగా వస్తుంది, దీనికోసం ప్రత్యేకించి సాఫ్ట్వేర్లు ఏమీ వాడక్కర్లేదు.వాడటానికి సులభంగా, ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయడం వలన ఐబస్ అనువర్తనాన్నే లినక్స్ లో ఎక్కువగా వాడుతున్నారు.


1. ఐబస్ ప్రాధాన్యతలు



System-> Preferences->IBus Preferences
ఈ విధంగా ప్రాంభించినపుడు 
 Yes(అవును) అని నొక్కండి.


Ok(సరే) చెయ్యండి.
ఇపుడు ఐబస్ ప్రాధాన్యతలను చూపిస్తుంది.ఐబస్ ప్రారంభించడం ఇదే మొదటిసారయితే ముందుగా ప్రాధాన్యతలను అమర్చుకోవాలి.దీనికోసం కింద తెలిపిన విధంగా చేయాలి.
ఇపుడు ఇన్పుట్ పద్ధతి(input method)కి వెళ్ళి ఏ భాష కీ బోర్డు లేఅవుట్ ఇన్పుట్ గా కావాలనుకుంటున్నారో వాటిని ఎన్నుకునిజత(Add)చేయాలి.
ఇలా చేసిన తర్వాత మీ ప్రాధాన్యత ప్రకారం జతచేసిన వాటిని మీరు పైకి కిందికి మర్చుకోవచ్చు.ఈ విధంగా చేయడం వలన మొదట ఉన్న ఇన్పుట్ పద్ధతి చేతన(enable)మవుతుంది.ఐబస్ అనువర్తనాన్ని చేతనం లేదా అచేతనం చేయుటకు Control+Space నొక్కవలసిఉంటుంది.తరువాయి ఇన్పుట్ పద్ధతికి మారాలంటే Alt+left Shift నొక్కాలి.
ఐబస్ అనువర్తనాన్ని అనువర్తన లాంచర్(alt+f2) లేదా టెర్మినల్ లో నడుపుటకు వాడవలసిన కమాండ్(ఆదేశం)
ibus-daemon -d


2. కీ బోర్డు పద్ధతి
దీనిని చేతన పరుచుటకు System->Preferences->Keyboard

 ఇలా కీ బోర్డు ప్రాధాన్యతలుచూపిస్తుంది.ఇందులోలేఅవుట్స్(Layouts) లోకివెళ్ళికలుపుము(add).
ఇపుడు ఈవిధంగా విండో ప్రత్యక్షమవుతుంది.
ఇక్కడ తెలుగు భాష ఎంచుకుని జతచేయండి(Add).

3.SCIM ఇన్పుట్ పద్ధతి
సార్వత్రిక అమరిక(global settings)లోకి వెళ్ళి మీకు కావలసిన ఇన్పుట్ భాషలను ఎంపిక చేసుకుని వాటిని అనువర్తించి వాడుకోవచ్చు.
ఈ విధంగా మీరు లినక్స్ లో సులువుగా టైపింగు చేసుకోవచ్చు.


లినక్స్ మరియు ఓపెన్ సోర్స్ సంభందిత దృశ్యకాలనిమా తెలుగు లినక్స్ యూ ట్యూబ్ ఛానల్ లో కూడా వీక్షించవచ్చు.దయచేసి చందాదారు(subscriber) కాగలరు. 


లినక్స్ లో టైపింగ్ పద్ధతులు

19, ఫిబ్రవరి 2011, శనివారం

గ్నోమ్

గ్నోమ్ కి అర్థం ఏమిటి? గ్నోమ్, ఆంగ్లంలో GNOME అనునది GNU Network Object Model Environment అన్న పదానికి క్లుపతరూపం. కానీ మనకు అది అవసరం లేదు.
అయితే
గ్నోమ్ అంటే ఏమిటి? గ్నోమ్  గురించి గ్నోమ్ వారు ఏం చెబుతున్నారంటే:

GNOME is a [free] Unix and Linux Desktop suite and development platform.
Gnome started life in August 1997, and was brought to life, as most things Linux, through lots of contributors via newsgroups.
గ్నోమ్ అనేది స్వేచ్ఛగా లభించే (ఉచితంగా??) యునిక్స్ మరియు లినక్స్ యొక్క తెర (స్క్రీన్/డెస్క్టాప్) ను చూపే వ్యవస్థ.
ఇందులో మనం రోజువారీ పనులకు వాడుకునే అన్ని ఉపకరణాలు ఉంటాయి.
1997 వ ఆంగ్ల సంవత్సరపు ఆగస్ట్ నెలలో గ్నోమ్ మొదలుపెట్టి లినక్స్ లోని ఇతర ప్రకల్పాల లాగానే కేవలం ఔత్సాహికుల స్వచ్ఛంద సహాయం ద్వారానే ముందుకు సాగుతోంది.

గ్నోమ్ కు ప్రత్యర్థి ఐన కెడిఈ కూడా ఇదే తరహాలో అభివృద్ధి చెందుతోంది. ఈ రెండు కలిసి ఒక నిర్దిష్ట వ్యవస్థను లినక్స్ లో తెచ్చాయి.
గ్నోమ్ ను గ్నోమ్ అనే పలకాలి గనోమ్ అనో లేక జీనోం అనో లేక నోమ్ అని పలకడం తప్పు.


1999 నాటి గ్నోమ్ మొదటి వెర్షన్ యొక్క తెరపట్టు
గ్నోమ్ లాభాలు :
  • ఇందులో మీకు విండో మేనేజర్ తో సహా అన్ని వాడుకరి ఉపకరణాలు కలవు
  • ఇది ఒక నిర్దిష్టమైన వ్యవస్థ
  • నాటిలస్ అనే ఫైల్ మేనేజర్ చాలా బాగా పని చేస్తోంది
  • గ్నోమ్ మన ఇష్టానుసారం మార్చుకోవచ్చు
  • కొన్ని వేల కొలది ఉపకరణాలు గ్నోమ్ కు అందుబాటులో కలవు
  • మంచి డాక్యుమెంటేషన్ మరియు తోడ్పాటు


                                                          గ్నోమ్ 2.6 తెరచాప


నేటి గ్నోమ్ 3.0 చాలా హంగులతో వచ్చే ఏప్రిల్ ఆరున విడుదలకాబోతోంది.


అది ఎలా ఉండబోతోందో ఒక నమూనా :

ప్రముఖ లినక్స్ పంపకాలు

దాదాపు ఈ చర్చ ఇప్పటికి నేనే నా బ్లాగులో రెండు సార్లు చేసేసాను.
నాకు మటుకు నేర్చుకునే రోజుల్లో
engg 1st year - Redhat, Fedora for lab, ubuntu at room
engg 2 year - ubuntu at college lab, mandriva and suse at room
engg 3 year - debian at lab, debian at room
engg 4 year - ubuntu at lab , ubuntu at room
today - ubuntu at office and ubuntu at my home pc

మన వాడకాన్ని అనుసరించి మనం వాడాలి , ఈ కింది జాబితా మీకు సహాయం చెయ్యగలదు.

పంపకం చిహ్నం వాడుకరి స్థాయి మంచి విషయాలు లోపాలు
రెడ్ హ్యాట్ / ఫెడోరా కోర్ Red Hat Linux / Fedora Core కొత్తవారి నుండి నిపుణులవరకు/సర్వర్ నిన్నమొన్నటివరకూ లినక్స్ అంటే రెడ్ హ్యాట్ లేక ఫెడోరా అన్నట్టు ఉండేది, సులువైన స్థాపన, వాడకం ఈ తరహా ఓఎస్ వాడే ఆర్పీఎం ప్యాకీజోల్లో చాలా వరకు అసమానతలు ఉన్నాయి.
సూజ్/సూస్ SuSE / OpenSuSE Linux కొత్తవారి నుండి నిపుణుల వరకు/సర్వర్ అన్ని రంగాలకు సంబంధించిన విషయవస్తువు కలదు ఆంగ్లంలో డాక్యుమెంటేషన్ ఇంకా సహాయం పుష్కలంగా కలవు. YAST Installer ఇంకా RPM పై ఆధార పడి ఉంది అందుచేత డిపెండెన్సీ చిక్కులు తప్పవు
మ్యాన్డ్రివ Mandriva / Connectiva / Mandrake Linux కొత్తవారి నుండి మధ్యస్థం వరకు వాడకం చాలా సులభం మిగతా పంపకాలతో పోలిస్తే వాడుకలో చాలా లిమిటెడ్
స్లాక్వేర్ Slackware Linux నిపుణుల స్థాయి/సర్వర్ సర్వర్ వ్యవస్థ కోసం కనిపెట్టబడింది నిపుణులైన లినక్స్ వాడుకర్లలో చాలా ప్రసిద్ధి వాడకం కొంచెం కష్టమే. సులువైన డెబ్ మరియు ఆర్పీఎం కాకుండా క్లిష్టమైన సోర్స్ ను కంపైల్ చెయ్యడం ద్వారా సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చెయ్యాలి
డెబియన్ Debian GNU/Linux మధ్యస్థం నుండి నిపుణ స్థాయి వరకు చాలా ప్రాచుర్యం పొందిన నమ్మదగిన పంపకం. డెబ్ ప్యాకేజింగ్ మరియు ఆప్ట్ వల్ల సమర్థవంతమయింది కొప్న్ని ఇతర పంపకాలు(ఉబుంటూ) కన్నా వెనుకంజలో ఉంది - ఇది చాలా వరకు అపోహ మాత్రమే!
ఉబుంటూ Ubuntu Linux కొత్తవారి నుండి నిపుణుల వరకు/సర్వర్ అన్ని లినక్స్ పంపకాల్లోనూ అతి కొత్త మరియు ప్రసిద్ధమయింది విడుదలైన కొద్ది రోజులకే చాలా ప్రాచుర్యం పొందింది. చాలా సుళువు. డెబియన్ నుండి వచ్చినా, ప్రతి ఆరు మాసాలకు ఒక మెరుగు తో ముందంజలో ఉంది ఇది స్వేచ్ఛా సాఫ్ట్వేర్ సిద్ధాంతాలు అనుసరిస్తుంది కాబట్టి ఎంపీత్రీ వంటి ప్రొప్రెయిటరీ సాఫ్ట్వేర్లు విడిగా స్థాపించుకోవాలి - అదీ సులభమే


ఇక హైదరాబాద్ నందు గలవారికి ఈ పై చెప్పబడిన పంపకాల గురించి నేరుగా వారి వద్దనే చూపించి స్థాపించబడును, వివరాలకు మమ్మల్ని సంప్రదించగలరు 

14, ఫిబ్రవరి 2011, సోమవారం

లినక్స్ ఎందుకు?

ఈ టపా ఇంతక ముందు రాసిన లినక్స్ అంటే ఏమిటి?  అన్న టపా కు తరువాయి భాగం.
లినక్స్ అవగాహనలో ఇది రెండవ మజిలీ.
మీకిప్పుడు లినక్స్ అంటే ఏమిటో తెలిసింది. 
కానీ అది మీరు విండోస్ లేక మ్యాక్ ను వదిలి లినక్స్ వాడుకర్లు కావటానికి దోహదం చేయదు.
లినక్స్ యునిక్స్ కన్నా ఎన్నోరెట్లు ప్రత్యేకమైనది. అదెలా?
ఇందుకు గల ముఖ్య కారణం లినక్స్ కు ఉన్న లైసెంస్ -- "ఓపెన్ సోర్స్"

లినక్స్ ఒక సంపూర్ణ ఓపెన్ సోర్స్ నిర్వహణా వ్యవస్థ, అదెలా?
ఇలా:
  1. లినక్స్ వాడే గ్నూ జెనరల్ పబ్లిక్ లైసెన్స్ ప్రకారం, మీరు లినక్స్ ను ఉచితంగా పొందవచ్చు, దాని మూలపదాల్ని కూడా పొంది, మార్పులు చేసి మరలా అందరికీ అందుబాటులో ఉంచవచ్చు. మరియు ఇలా తిరిగి పంచేప్పుడు కావాలంటే ఒక ధర నిర్ణయించి ఆ ధరకు అమ్మవచ్చుకూడా!
  2. లినక్స్ మూల పదాలు(సోర్స్ కోడ్) అందుబాటులో ఉండటం వలన అలా రూపొందే సాఫ్ట్వేర్ లో సాధారణం కంటే తక్కువ లోపాలు(బగ్స్) ఉంటాయి, మరియు అవి కూడా వెంటనే నివృత్తి చేయబడి, లోపరహితంగా ఉండే లినక్స్ అందుబాటులో ఉంటుంది.
  3. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అంటే అది ఎటువంటి ప్లాట్ఫాం అయినా పనిచేస్తోంది. వహనీయత చాలా విస్తృతం.
  4. నమ్మదగిన సాఫ్ట్వేర్ ఎందుకంటే మూలపదాలు మనవద్ద  ఉండటంవలన మన దస్త్రాలు లేక మన సమాచారం ఏ-ఏ మార్పులకు లోనవుతుందో మనకు తెలుసు, అందువల్ల సమాచారచౌర్యం(data stealing, eavesdropping) వంటి సమస్యలు ఉండవు.
  5. ఏదో ఒకరోజు ఫలానా సాఫ్ట్వేర్ కంపెనీ జెండా ఎత్తేస్తే ఆ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉండదు అన్న సమస్య నెట్ స్కేప్ వాడుకర్లకు నెట్స్కేప్ బ్రౌజరు  నిలిపివేత తరువాత ఎదురైంది. అలా ఏనాటికీ లినక్స్ మూసివేత ఉండదు.
  6. ఇది ఉచితం! మరియు ఎటువంటి సాంకేతిక సహాయం కావాలన్నా మేమున్నాం! :)
అంటే, మీకు డబ్బూ ఖర్చు ఉండదు, మంచి నాణ్యతగల సాఫ్ట్వేర్ కూడా మీ స్వంతం!
మరి వాణిజ్యం? సాధారణంగా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ వ్యవస్థకు ఆదాయం సాంకేతిక సహాయం, పంపకాలు మరియు శిక్షణ ద్వారా వస్తాయి. ఇది ఒక వినూత్నమైన వ్యాపార సూత్రం, దీనిని ఇప్పటికే వాణిజ్యరంగంలో మహామహులైన ఐబీఎమ్, హెచ్ పీ, నోవెల్, సన్ , ఇన్టెల్ ఆచరణలో పెట్టారు. ఐటీకాని కంపెనీలు, ఉదాహరణకు బోయింగ్, గ్లాక్సోస్మి త్క్లైన్  , మొదలగునవి కూడా ఈ సూత్రాన్నే వాడుతూ ఓపెన్ సోర్స్ కు తమ వంతు తోడ్పాటు చేస్తున్నారు.

ఎంతటి క్లిష్టమైన పనినైనా చెయ్యటానికి లినక్స్ ఒక నమ్మదగిన వేదిక:
  • విండోస్ వంటి వాటితో పోలిస్తే అనవసరపు ప్రోగ్రాంలతో లినక్స్ సమర్థవంతంగా పని చెయ్యటం వల్ల మీ సిస్టం క్రాష్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. మీ దస్త్రాలకు భద్రత.
  • లినక్స్ లో ప్రస్తుతం వైరస్లు లేవు. లినక్స్ వంటి నిర్దిష్టమైన వ్యవస్థలో ప్రస్తుత వైరస్ లు చొరబడలేవు, పూర్తి వైరస్ తీరుతెన్నులు మారితే గానీ ఆ అవకాశం లేదు, అది ఇప్పట్లో సాధ్యం కాదు.
  • ఇది పాత, మూలపడిన మీ హార్డ్వేర్ పై కూడా నడుపవచ్చు.
  • యాంటివైరస్లకు ఇక స్వస్తి పలుకండి.
  • సెక్యూరిటీ(భద్రత) అనేది ఇక్కడ ఒక భాగం, అదనపు విశేషం కాదు.


లినక్స్ కొన్ని అద్వితీయమైన ఉత్తమమైన సాఫ్ట్వేర్లకు నెలవు. అంతకంటే ఉత్తమమైన విషయం ఇవి ఉచితంగా లభించడం. చట్టరీత్యా విండోస్ లేక అడోబ్ వారిచ్చే వీడియో లేక ఆడియో ప్లేయర్లకు వారు మనవద్ద రుసుము తీసుకొనవచ్చు, అలా కాకపోతే అది అనైతికం అవుతుంది. కానీ లినక్స్ తో ఆ చిక్కులు లేవు.


లినక్స్ తోవచ్చే కొన్ని ప్రముఖమైన సాఫ్ట్వేర్లు:

    ఓపెన్ ఆఫీస్ (ప్రస్తుతం లిబ్రే ఆఫీస్)
    Gimp Logo
    గింప్ : ఫోటోషాప్ కు ధీటుగా అందుబాటులో ఉన్న ఫోటో కూర్పు సాఫ్ట్వేరు
    VideoLan movie playerవీడియోలాన్ (వీఎల్సీ)
    ప్రముఖ మీడియా ప్లేయర్.
      Gaim Instant Messengerపిడ్గిన్ యాహూ, జీమెయిల్, ఐఆర్సీ, ల్లో చాటింగ్ చేస్కొనే ఉపకరణం 
    Evolution email and groupware clientఎవల్యూషన్ మైక్రోసాఫ్ట్ ఎక్స్చేంజ్ కు ధీటైన బహుముఖ సాఫ్ట్వేఋ
...ఇలా ఎన్నో ఎన్నెన్నో...
మరి అంతా ఉచితమయితే, నాకేమిటంటా? 

మీరే కాదు చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడే పొరబడుతుంటాయి. చాలా వరకు లినక్స్ అంటే ఒక వ్యాపకం, అది కాలేజీ కుర్రాళ్ళకుండే ఒక చెడు వ్యసనం అని ఫీలయ్యేవాళ్ళు నేటికీ ఉన్నారూ( మా హెచ్ ఓడీ తోసహా)
అయితే ఇవన్నీ కేవలం అపోహలు. నిజాలు:
  • ఎలా అయితే కార్పొరేట్ సాఫ్ట్వేర్లను పెద్ద కంపెనీలు కొని వాడుకుంటాయో అలానే లినక్స్ ను కూడా కొని వాడుతారు.
  • ఇన్టెల్ వంటి బహుళజాతి సంస్థలు లినక్స్ లో భారీగా పెట్టుబడులు పెట్టి తద్ఫలితంగా వారు తయారుచేసిన హార్డ్వేర్ కు వెనువెంటనే పని చేయించే సాఫ్ట్వేర్ కేవలం లినక్స్ మాత్రమే ఇవ్వగలదు. విండోస్ వంటి సాఫ్ట్వేర్లు కొత్తగా వచ్చిన హార్డ్వేర్కు సరిపోవు.
  • చైనా వంటి దేశాల్లో ౭౦% వరకూ అన్ని కంప్యూటర్లలోనూ లినక్స్ ను మాత్రమే వాడుతున్నారు.ఈ విధంగా ఆ దేశ పౌరులకు చాలా వరకు ధనం ఆదా అవుతుంది. తద్వారా కంప్యూటర్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.
  • మరెన్నో కంపెనీలు వారి సర్వర్లను లినక్స్ కు మార్చుకుంటున్నారు, కారణం : రక్షణ మరియు భద్రత.
  • అలానే ఈ విధంగా లినక్స్ ద్వారా, లేక ఇతర స్వేచ్ఛా సాఫ్ట్వేర్ల ద్వారా లాభం పొందిన వ్యక్తులు, విద్యార్థులు, సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వారి వారి తోడ్పాటులను లినక్స్ కు తిరిగి అందించటం ద్వారా లినక్స్ మరింత ప్రభావవంతం అవుతున్నది. దీనికి మంచి ఉదాహరణ : వికీపీడియా. వికీపీడియా ఎటువంటి ఖర్చులేకుండా పూర్తి ఉచితంగా మీకు సమాచారాన్ని అందిస్తుంది, అందువల్లనే కోట్లాది మంది మరలా తిరిగి వికీపీడియాకు సమాచారాన్ని చేర్చి మరింత సమృద్ధి పరుస్తున్నారు. 

లినక్స్ లోని అన్ని ప్రకల్పాలు(ప్రాజెక్టులు) దాదాపు ఇదే విధంగా పని చేస్తాయి.

8, ఫిబ్రవరి 2011, మంగళవారం

డెబియన్ 6.0 స్క్వీజ్ విడుదలైంది


అంచెలంచెలుగా ఎదిగిన డెబియన్ గ్నూ/లినక్స్ నేడు6.02.2011 న ఆరవ వెర్షన్ విడుదల చేసింది.24 నెలల సుధీర్ఘ అభివృద్ధి తర్వాత డెబియన్ ప్రోజెక్టు సగర్వంగా సరికొత్త స్థిరమైన వెర్షన్ డెబియన్ 6.0 కోడ్ పేరు "squeeze/స్క్వీజ్". డెబియన్ 6.0 ఒక ఫ్రీ ఆపరేటింగ్ సిస్టం, మొట్టమొదటిసారిగా రెండు రకాలలో విడుదల చేయబడింది.డెబియన్ గ్నూలినక్స్ తో పాటుగా కొత్తగా డెబియన్ గ్నూ/కెర్నెల్ ఫ్రీడమ్ BSD ప్రవేశపెట్టారు.డెబియన్ 6.0 కెడిఇ డెస్క్టాపు మరియు అనువర్తనాలు, గనోమ్,Xfce LXDE డెస్క్టాపు ఎన్విరాన్మెంట్లను కలిగి అదేవిధంగా సెర్వర్ అనువర్తనాలన్నిటికీ కూడా ఇవి వర్తిస్తాయి.స్క్వీజ్ ముందు వెర్షన్ "లెన్ని" 5.0.8 నవీకరణ కూడా మొన్నీమధ్యనే జనవరిలో విడుదల అయింది.డెబియన్ అరచేతిలో పట్టే నెట్ బుక్ ల నుండి సూపర్ కంప్యూటర్ల వరకూ ఎందులోనైనా నడుస్తుంది.ఈ విడుదలలో ముఖ్యంగాచెప్పుకోదగ్గ మరొక విషయం ఏమిటంటే డెబియన్ స్థాపన దాదాపు తెలుగులోనే కొనసాగించవచ్చు.

మొత్తానికి 9 నిర్మితాలకు  డెబియన్ సహకారం అందిస్తుంది:32-bit PC / Intel IA-32 (i386), 64-bit PC / Intel EM64T / x86-64 (amd64), Motorola/IBM PowerPC (powerpc), Sun/Oracle SPARC (sparc), MIPS (mips (big-endian) and mipsel (little-endian)), Intel Itanium (ia64), IBM S/390 (s390), and ARM EABI (armel).
 
డెబియన్ స్క్వీజ్ సాధారణ డెస్క్టాపులో ప్యాకేజీలు ఈ విధంగా ఉన్నాయి.

  • గనోమ్ 2.30.0
  • టోటెమ్ 2.30.2
  • బ్రాసెరో (CD/DVD బర్నర్)
  • జిపార్టెడ్ 0.7.0
  • పిడ్జిన్ 2.7.3
  • రిధమ్ బాక్స్ 0.12.8
  • ఓపెన్ ఆఫీస్ 3.2.1
  • ఐస్ వీసెల్(మోజిల్లా పైర్ఫాక్స్ నకలీ)
  • గింప్ 2.6.10
  • అపాచి 2.2.16
  • సాంబ 3.5.6
  • పైతాన్ 2.6.6, 2.5.5 మరియు 3.1.3
  • PHP 5.3.3
  • Perl 5.10.1
  • ఇతర...
10,000 కొత్త ప్యాకేజీలు క్రోమియమ్ బ్రౌజర్ వంటివి, ప్యాకేజీ నిర్వాహణ సాప్ట్వేర్ సెంటర్,నెట్వర్కు నిర్వాహకి...వంటివి డెబియన్ 6.0లో లభిస్తాయి.డెబియన్ 6.0 కొత్త డిపెండెన్సి ఆధారిత బూట్ సిస్టం ప్రవేశపెట్టారు, దీనివలన సిస్టం తొందరగా ప్రారంభమవుతుంది.
డెబియన్ చాలా విధాలుగా స్థాపించవచ్చు  బ్లూ-రే డిస్కుల నుండి,DVDలు,CDలు మరియు  USB లనుండి  లేదా నెట్వర్కు నుంచి కూడా స్థాపించవచ్చు.ఈ విడుదలలో 8 డివిడిలు లేదా 52 సిడిలలో పూర్తి ప్యాకేజీలతో లభిస్తుంది.ఇంతకు ముందు చె
ప్పినట్టుగానే ప్రామాణిక డెబియన్ స్థాపన కోసం మొదటి ఒక సిడి లేదా డివిడి డౌన్లోడు చేసుకుంటే సరిపోతుంది.మొత్తం అన్నీ అవసరం లేదు.కాకపోతే ఎవరికైతే అంతర్జాల సదుపాయం లేదో వారు మిగతా డిస్కులను కలిగిఉంటే వారు సులువుగా ఆ డిస్కులను డ్రైవ్ నందు పెట్టి నేరుగా మిగిలిన సాప్ట్వేర్లను స్థాపించవచ్చు. సిడి/డివిడి ఇమేజ్ (.iso)ఫైళ్ళను మీరు ఉచితంగా నేరుగా లేదా టోరెంట్లు లేదా jigdo ద్వారా వివిధ పద్ధతులలో డౌన్లోడు చేసుకోవచ్చు లేదా ఆన్ లైన్ వర్తకుల నుండి కొనుక్కోవచ్చు.సంస్థాపన మార్గదర్శికను ఇక్కడ చూడవచ్చు.డెబియన్ పూర్తిగా ఉచితం, మీరు ఉచితంగా డౌన్లోడు చేసుకోవచ్చు.కావలిసిందల్లా అంతర్జాల సదుపాయం ఒక్కటే. మరిన్ని వివరాలకు ఈ పేజీని సందర్శించగలరు.

డెబియన్ 6.0 స్క్వీజ్ తెరచాపను ఇక్కడ గమనించవచ్చు.

7, ఫిబ్రవరి 2011, సోమవారం

డెబియన్ విడుదలల కథా కమామీషు

డెబియన్  సగటున 1.5 సంవత్సరాల వ్యవధిలో ఒక కొత్త వెర్షన్ విడుదల చేస్తుంది.అంటే దాదాపు 535 రోజుల వ్యవధిలో ఒక కొత్త వెర్షన్ విడుదల అవుతుంది.దీని అభివృద్ధి సాధారణంగా మూడు స్థితుల్లో జరుగుతుంది.వీటిని స్థిరమైన,పరీక్షించబడుతున్న,అస్థిరమైన దశలుగా విభజించారు.ఇందులో మొదటిగా అస్థిరమైన దశలో ఉన్న దానిని తీసుకుని అందులో గల లోపాలను కొంతవరకూ సరిచేసిన తర్వాత దానిని పరీక్షించబడుతున్న స్థితిలో ఉన్న దానిగా పరిగణించి దాంట్లో కూడా ఉన్న దోషాలను ఎప్పటికప్పుడు పరిశీలించి వాడుకరులనుంచి సేకరించి వాటిలోని ఉన్న దోషాలను కూడా పరిష్కరించి ఒక స్థిరమైన స్థితికి తీసుకువస్తారు అలా అ దశలో ఉన్న దానిని స్థిరమైనది(Stable)గా  ప్రకటిస్తారు.డెబియన్ అభివృద్ధి క్రమంలో ఉన్నమూడు దశలు ఇక్కడ గమనించవచ్చు.
  • Stable (స్థిరమైన)
  • Testing (పరీక్షించబడుతున్న)
  • Unstable (అస్థిరమైన)
డెబియన్ ప్రతీ విడుదలకూ ఒక పేరు ఉంటుంది కదా అది టాయ్ స్టోరీ అనే ఒక అంగ్ల చిత్రంలోని పాత్రలను తీసుకుని పెట్టడం జరుగుతుంది.డెబియన్ ప్రోజెక్టు ఎల్లప్పుడూ అస్థిర విడుదల మీద పని కొనసాగిస్తుంది.దీనినే "సిడ్ "(కోడ్ పేరు sid, ఇది కూడా టాయ్ స్టోరీ చిత్రంలో ఒక పాత్ర.సిడ్ అనే పేరు గల కుర్రాడు బొమ్మలను ధ్వంసం చేస్తూ అనందిస్తూ ఉండే ఒక దుష్టమైన పాత్ర.)గా పిలుస్తారు.ఇక ఈ పేరును డెబియన్ వారు ఎంతో తెలివిగా SID(Still in Developement)గా వాడుతున్నారు.ఇందులో కొత్తగా నవీకరించబడిన ప్యాకేజీలను స్థిరంగా ఉన్న కొత్త విడుదలకు జతచేసి తరువాయి స్థిరమైన విడుదలకు ప్రయత్నిస్తారు.ఈ విధంగా డెబియన్ విడుదల చక్రం తిరుగుతూ ఉంటుంది.డెబియన్ ఎల్లప్పుడూ ఒక స్థిరమైన విడుదలని వాడుకలో ఉంచుతుంది.ఎప్పుడైతే ఒక కొత్త వెర్షన్ విడుదలవుతోందో , అంతకు ముందు విడుదల అయిన వెర్షన్ కి మరో సంవత్సరం పాటు డెబియన్ రక్షణ బృందం వారు మద్ధతు అందిస్తారు.తరువాయి స్థిరమైన విడుదల అయ్యేవరకూ అస్థిర మరియు పరీక్షించబడుతున్న రెండు నిక్షేపాలను ఎడతెగకుండా నవీకరించి అభివృద్ధి చేస్తారు.మీరు డెబియన్ కు కొత్త అయితే స్థిరమైన వెర్షన్ వాడిండి.మీరు ఇంతకు పూర్వమే లినక్స్ వాడిన అనుభవం ఉంటేమరియు కొత్త సాప్ట్వేర్లు కోసం పరీక్షించబడుతున్న దానిని వాడవచ్చు.ఇప్పటివరకూ విడుదల అయిన క్రమాన్ని ఇక్కడ గమనించవచ్చు.



ప్రతీ విడుదలకూ కొత్త సాప్ట్వేర్లను మరియు ప్యాకేజీలను నవీకరిస్తూ, కొత్త నిర్మితాలకు(ఆర్కిటెక్చర్లకు) మద్ధతును పెంచుతూ డెబియన్ ముందుకు కొనసాగుతుంది.ఇప్పటి వరకూ విడుదల అయిన వెర్షన్లను ఒకసారి చూద్దాం.
  • 1.1 Buzz (బజ్జ్-17 జూన్ 1996)
  • 1.2 Rex (రెక్స్-12 డిసెంబర్ 1996)
  • 1.3 Bo (బో-5 జూన్ 1997)
  • 2.0 Hamm (హమ్మ్-24 జూలై 1998)
  • 2.1 Slink (స్లింక్-9 మార్చి 1999)
  • 2.2 Potato (పొటాటో-15 జూలై 2000)
  • 3.0 Woody (వుడీ-19 జూలై 2002)
  • 3.1 Sarge (సార్జ్-6 జూన్ 2005)
  • 4.0 Etch (ఎట్చ్-8 ఏప్రిల్ 2007)
  • 5.0 Lenny (లెన్ని-14 ఫిబ్రవరి 2009)
  • 6.0 Squeeze (స్క్వీజ్-6 ఫిబ్రవరి 2011)

డెబియన్ -ది యూనివర్సల్ ఆపరేటింగ్ సిస్టం

డెబియన్ 1993లో ఇయాన్ ముర్డాక్ అనే పుర్డ్యు విశ్వవిద్యాలయ విద్యార్ధిచే సృష్టించబడింది.అతను లినక్స్ పంపకం అందరికీ అందుబాటులో డెబియన్ ప్రణాళిక ఉండేటట్లు రూపొందించాడు.డెబియన్ కు పేరు ఎలా వచ్చిందంటే అతని స్నేహితురాలి(ఇపుడు అతని భార్య ) పేరు డెబ్రా(DEBRA) లోని మొదటి మూడు అక్షరాలను తన పేరులోని(Ian Murdock) మొదటి మూడు అక్షరాలను కలిపి DEBIAN గా తయారయింది.దీనిని డెబియన్(deb-e′-en)అని పిలుస్తారు.



           డెబియన్ అంటే చాలా మందికి తెలియదు మనవాల్లకి ఉబుంటునో లేదా లినక్స్ మింట్ వంటి వాటి గురించి తెలుసేమోగాని దీని గురించి మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు.అసలు వీటన్నిటికీ మూలమే డెబియన్.ఇది లినక్స్ కెర్నల్ను మరియు గ్నూ ఆపరేటింగ్ సిస్టం సాధనాలను వాడి చేయబడింది కనుక డెబియన్ గ్నూ/లినక్స్ గా కూడా పిలుస్తారుదీనిని డెస్క్టాపు మరియు సెర్వర్(సేవిక)గాను వాడుకోవచ్చు.డెబియన్ లినక్స్ యునిక్స్ మరియు ఉచిత సాప్ట్వేర్ సంబందిత తత్వాలను ఖచ్చితంగా అనుసరిస్తుంది.డెబియన్ అభివృద్దిచేసేవారు స్థిరమైన,దృఢమైన రక్షణతో తయారుచేయటానికే వారి దృష్టినికేంద్రీకరిస్తారు.ఇలా రూపొందించిన దానినే చాలా ఇతర లినక్స్ పంపకాలు ఆధారంగా వాడుకుంటాయి, వాటిలో ఉబుంటు,లినక్స్ మింట్ నాపిక్స్, గ్సాండ్రోస్లు ఇతర ఉన్నాయి.
అందరికీ అందుబాటులో ఉండే ఒక ఫ్రీ ఆపరేటింగ్ సిస్టం అభివృద్ధిపరచాలనేదే డెబియన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది స్వచ్ఛంద కార్యకర్తలచే మరియు లాభం ఆశించని స్వచ్ఛంద సంస్థల విరాలాలచే అభివృద్ధి చేయబడుతుంది.
           
            డెబియన్ విరివిగా పొందగలిగిన సాప్ట్వేర్లకు,ఐచ్ఛికాలకు కొలువు.ప్రస్థుత స్థిర విడుదల 25 వేల సాప్ట్వేర్ ప్యాకేజీలను 12 వివిధ రకాల కంప్యూటర్ నిర్మితాలకు అందిస్తుంది. నిర్మితాలలో ఇంటెల్/AMD 32-బిట్/64-బిట్ నిర్మితాలు వ్యక్తిగత కంప్యూటర్లలో వాడబడుతుంటే, ARM నిర్మితాలలో ముఖ్యంగా ఎంబెడెడ్ సిస్టంలలో మరియు IBM సెర్వర్ మెయిన్ ఫ్రేమ్ లలో సాధారణంగావాడుతూ కనిపిస్తున్నాయి.డెబియన్ లో చెప్పుకోదగ్గ ముఖ్య మైనది APT ప్యాకేజీ మేనేజ్ మెంట్ సిస్టం, అధిక మొత్తంలో ప్యాకేజీలు, నిర్ణబద్దమైన ప్యాకేజీల విధానాలు, అధిక నాణ్యత కలిగిన విడుదలలు. పద్ధతి ద్వారా పాత ప్యాకేజీల నుండి కొత్తగా విడుదల అయిన ప్యాకేజీలను కావలిసిన వాటిని స్వయంచాలకంగా స్థాపించి అనవసరమైన ప్యాకేజీలను తొలగిస్తుంది.డెబియన్ మరియు దాని ఆధారిత సాప్ట్వేర్లన్నీ .deb అనే పొడిగింతతో ఉంటాయి,వీటిని డెబియన్ ప్యాకేజీలుగా పిలుస్తారు.వీటిని సులభంగా స్థాపించి వాడుకోవచ్చు.


           డెబియన్ ప్రమాణిక స్థాపనలో GNOME డెస్క్టాప్ పర్యావరణం వాడబడుతుంది.ఇందులో లిబ్రేఆఫీసు,ఐస్ వీసెల్(ఫైర్ఫాక్స్ నకలీ), ఎవల్యుషన్ మెయిల్, CD/DVD వ్రైటింగ్ ప్రోగ్రాంలు, సంగీత మరియు వీడియో ప్లేయర్లు, చిత్రాల వీక్షక మరయు సవరణ సాప్ట్వేర్లు, మరియు PDF చదువరి సాప్ట్వేర్లు డెబియన్ స్థాపించినపుడే దానితో పాటే స్థాపించబడతాయి.ముందుగా తయారుచేయబడిన CD ఇమేజ్లు KDE సాప్ట్వేర్ల కంపైలేషన్, Xfce మరియు LXDE వంటి డెస్క్టాపు పర్యావరణాలకు కూడా అందుబాటులో ఉన్నాయి.
           డెబియన్ ను డౌన్లోడు చేసుకోవాలంటే అక్కడ మనకు చాలా ఇమేజ్ ఫైళ్ళు కనిపిస్తాయి.DVD ఫైళ్ళు అయితే ఐదు లేదా CD ఫైళ్ళు ఐతే ముప్పయి వరకూ ఉంటాయి.వీటిని చూసి చాలా మంది డౌన్లోడు చేసుకోవడానికి కూడా సాహసించరు నిజానికి అందులో ఉన్న మొదటి ఒక్క డిస్కు సరిపోతుంది పూర్తి ప్రామాణిక స్థాపన కోసం.మిగిలిన డిస్కులలో సిస్టం స్థాపనకు అవసరం లేని అధిక సాప్ట్వేర్లను ఉంచుతారు.మీరు ఒకసారి మొదటి డిస్కు పెట్టి డెబియన్ స్థాపించన తరువాత మీరు నేరుగా అంతర్జాల సదుపాయం మీకు ఉంటే మిగిలిన మీకు కావలసిన సాప్ట్వేర్లను నేరుగా డౌన్లోడు చేసుకుని స్థాపించుకోవచ్చు.అలాకాకుండా మీకు నెట్ సదుపాయం లేకపోతే మిగిలిన డిస్కులను మీరు కలిగిఉంటే డిస్కులను పెట్టి నేరుగా వాటినుండి సాప్ట్వేర్లను స్థాపించుకోవచ్చు.వాటిని(మిగిలిన డిస్కులను) అందించటంలో ముఖ్య ఉద్ధేశ్యం అంతర్జాల సదుపాయం లేకుండా సాప్ట్వేర్లు స్థాపించుకునే వీలు ల్పించడమే. సిడి/డివిడి ఇమేజ్ (.iso)ఫైళ్ళను మీరు ఉచితంగా నేరుగా లేదా టోరెంట్లు లేదా jigdo ద్వారా వివిధ పద్ధతులలో డౌన్లోడు చేసుకోవచ్చు లేదా ఆన్ లైన్ వర్తకుల నుండి కొనుక్కోవచ్చు.

మన దేశంలో వాడుకోలోనున్న సి-డాక్(C-DAC) వారి బాస్(భారతీయ ఆపరేటింగ్ సిస్టం సొల్యూషన్స్) మరియు స్వేచ్ఛ వంటివి కూడా డెబియన్ ఆధారితాలే...