27, ఏప్రిల్ 2012, శుక్రవారం

ఉబుంటు 12.04 విడుదలైంది


ఉబుంటు సరికొత్త విడుదల ఉబుంటు 12.04 విడుదలైంది. ఈ విడుదలలోని విశేషాలేమిటో చూద్దాం. ఈ విడుదల యొక్క సంకేత నామం ప్రిసైజ్ ప్యాంగోలిన్. ఈ విడుదలకు 04/2017 వరకూ మద్ధతుంది. LTS అంటే లాంగ్ టెర్మ్ సపోర్ట్(దీర్ఘకాలిక మద్ధతు).




మార్పులు - చేర్పులు
ఈ రూపాంతరంలో ఇటీవలే విడుదలైన గ్నోమ్ 3.4 అనువర్తనాలను వినియోగించారు. కానీ అప్రమేయ అంతరవర్తిగా మాత్రం యునిటీనే కొనసాగించారు.
యునిటీ అంతరవర్తి
ఉబుంటు జట్టు అభివృద్ధి చేసిన అంతరవర్తి యునిటీ, దీనిని మరింతమెరుగ్గా, వాడుటకు సరళంగా మరియు మరింత స్థిరంగా తీర్చిదిద్దారు. ఉబుంటు సాఫ్టువేర్ సెంటర్ మరియు ఉబుంటు వన్ వంటి వాటికి యునిటీ సమన్వయాన్ని మెరుగుపరిచారు. 
అనువర్తనాలు
లినక్స్ కెర్నల్ 3.2.0-23.36, యునిటీ 5.10, నాటిలస్ 3.4.1, జియెడిట్ 3.4.1, గ్విబర్ 3.4, రిథమ్ బాక్స్ 2.96, ఉబుంటు సాఫ్టువేర్ సెంటర్ 5.2, సరికొత్త లిబ్రే ఆఫీస్ 3.5.2 మరియు మొజిల్లా ఫైర్ ఫాక్స్ 11.0 రూపాంతరాలు, థండరుబర్డ్ ఈమెయిల్ కక్షిదారు 11.1, ఎంపతి సత్వర సందేశకం 3.4.1, టోటెమ్ చలనచిత్ర ప్రదర్శకం 3.0.1, షాట్వెల్ 0.12, ట్రాన్స్మిషన్ 2.51
బన్షీకి బదులుగా రిథమ్ బాక్సును తిరిగి అప్రమేయ సంగీత ప్రదర్శకముగా తీసుకున్నారు. బన్షీతో పాటుగా  టోంబాయ్ మరియు జీబ్రెయినీ అనువర్తనాలను తీసివేసారు.
గ్నోమ్ నియంత్రణ కేంద్రంలో జిట్ గీస్ట్ కార్యకలాపాల చిట్టా నిర్వాహకం ద్వారా గోప్యత (ప్రైవసీ) ఐచ్ఛికాన్ని చేర్చారు. దీనిని ఉపయోగించి ఇటీవలి వాడిన దస్త్రాలు, సంచయాలు, అనువర్తనాల చరిత్రను చెరిపివేయవచ్చు.
ఉబుంటు సాఫ్టువేర్ కేంద్రం
సరికొత్త రూపంతో, మరిన్ని హంగులతో ఉబుంటు సాఫ్టువేర్ కేంద్రాన్ని బాగా తీర్చిదిద్దారు. అంతే కాకుండా అనువర్తనాల సమీక్షా విధానం ఉండటం వలన సమీక్షలను చదివి అనువర్తనాలను స్థాపించుకోవచ్చు, మీ అభిప్రాయాలను కూడా జోడించవచ్చు. కొనుగోలు చేయుటకు అనేక ఆటలు, మ్యాగజైనులు...అందుబాటులో ఉంచారు, పేపాల్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పుస్తకాలు మరియు మ్యాగజైన్స్ అనే కొత్త వర్గం చేర్చబడింది. బహుళ తెరపట్టులు, సిఫారసుల వ్యవస్థ, భాషా ప్యాక్ల మద్ధతు చెప్పుకోదగినవి.
ఉబుంటు తెలుగు లినక్స్ స్థితి:
ఉబుంటు అనువాదం దాదాపు 71 శాతం పూర్తయివుంది, స్థాపక ప్రక్రియ నుండే తెలుగు అందుబాటులో ఉన్నది. అందువల్ల దాదాపు ఉబుంటు నిర్వాహక వ్యవస్థ అంతా తెలుగులో అందుబాటులో ఉంది. అంతేకాక కొత్తగా ప్రయత్నించాలనుకుంటున్నవారు ప్రయత్నించి చూడవచ్చు ఒకవేళ నచ్చకపోతే ఆంగ్ల భాషలోకి మారిపోవడం కూడా ఎంతో సులభం. అందువల్ల ఆసక్తి ఉన్నవారు ప్రయత్నించవచ్చు.
ఉబుంటు తెలుగు లినక్స్ గణాంకాలు


ఉబుంటు 12.04 కు ఉన్నతీకరణ(అప్ గ్రేడ్) ద్వారా మారండి
ఒకవేళ మీరు ఉబుంటు పాత విడుదలని వాడుతున్నట్లయితే, క్రిందపేర్కొన్న ఆదేశాల ద్వారా మీ వ్యవస్థను కొత్త విడుదలకు ఉన్నతీకరించవచ్చును.
ముందుగా మీరు వాడుతున్న ప్యాకేజీలన్నీ తాజాగా ఉండేట్టు చూసుకోండి లేకపోతే
sudo apt-get update

sudo apt-get dist-upgrade

ఆ తరువాత క్రింది ఆదేశాన్ని నడపండి
sudo update-manager -d


ఉబుంటు 12.04 ను దింపుకోండి...
ఒకవేళ మీరు ఉబుంటూకి కొత్త అయితే, ఉబుంటు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఇక్కడ ఒక లుక్కేసుకోండి. స్థాపన సహాయం కోసం ఈ లంకెను సందర్శించవచ్చు.




ప్రత్యామ్నాయ దింపుకోలు లంకెలు | దింపుకోలు మిర్రర్లు.


వీటిని కూడా చూడండి:
హైదరాబాదులో ఉబుంటు విడుదల వేడుక చేసుకుందామా..?
మీ అభిప్రాయం తెలపండి

21, ఏప్రిల్ 2012, శనివారం

లినక్స్ దస్త్ర వ్యవస్థ

విండోస్, లినక్స్ మరియు మాక్ ఇలా ప్రతీ నిర్వహణ వ్యవస్థకు ఒక దస్త్ర వ్యవస్థ ఉంటుంది. లినక్స్ మరియు మాక్ రెండూ యునిక్స్ దస్త్ర వ్యవస్థను వాడుకుంటాయి. లినక్స్ లో రూట్ వ్యవస్థ బ్యాక్ స్లాష్(/) వినియోగించబడితే విండోసులో ఫ్రంట్ స్లాష్(\) వాడబడుతుంది. లినక్సుకు మరియు విండోసుకు ఎంతో వైవిధ్యం ఉన్నది. విండోసులో పెద్ద అక్షరాలు మరియు చిన్న అక్షరాలు ఏదైనా ఒకటే కానీ లినక్స్ నందు అలా కాదు (లెటర్స్ కేస్ సెన్సిటివ్) పెద్ద అక్షరాలు వేరు మరియు చిన్న అక్షరాలు వేరు. అందువలన కొన్ని సార్లు దస్త్రాలను కనుగొనడం ఎంతో కష్టమవవచ్చు. ముఖ్యంగా FTP ఉపయోగించేటప్పుడు.

డైరెక్టరీ వివరణ
/bin ప్రధాన బైనరీ ఆదేశాలు (cd,pwd,ls)
/boot వ్యవస్థ బూట్ లోడర్ యొక్క స్థిర దస్త్రాలు(వ్యవస్థను ప్రారంభించు ముఖ్యమైన దస్త్రాలు)
/dev పరికరము దస్త్రాలు (సీడి, డివిడీ లేదా పెన్ డ్రైవ్) అన్ని ఇచట లోడవుతాయి
/etc వ్యవస్థ కాన్ఫిగరేషన్ (స్వరూపణ) దస్త్రాలు
/home వాడుకరులు మరియు వారి వ్యక్తిగత దస్త్రాలను భద్రపరుచుకునే స్థలము (పత్రాలు, చిత్రాలు, సంగీతం, వీడియో..)
/lib వ్యవస్థ లైబ్రరీలు
/media తీసివేయదగిన మాధ్యమం అనుసంధాన కేంద్రం
/mnt ఒక దస్త్ర వ్యవస్థను తాత్కాలికంగా మౌంటు చేసేస్థలం
/opt యాడ్ ఆన్ అనువర్తన సాఫ్టువేర్ ప్యాకేజీలు
/proc వ్యవస్థ ప్రక్రియ సమాచారం (వ్యవస్థ మెమొరీ, మౌంటుచేయబడిన పరికరాలు, హార్డువేర్ స్వరూపణం..)
/root వ్యవస్థ నిర్వాహకుని నివాస సంచయం
/sbin (సూపర్ బైనరీ) వ్యవస్థ ప్రధాన ఆదేశాలు (ifconfig,fdisk..)
/srv సేవకంగా ఈ వ్యవస్థ అందించు సమాచారం నిల్వ స్థలం -సెర్వర్ (సేవకం)
/tmp తాత్కాలిక దస్త్రాలు
/usr వాడుకరి బైనరీలు, పత్రీకరణ, లైబ్రరీలు, మరియు వాడుకరి కార్యక్రమాలు, ఇది చాలా ముఖ్యమైనది మరియు ఎక్కువ సమాచారం ఇక్కడే భద్రపరుచబడుతుంది
/var లాగ్ ఫైళ్లు(చిట్టాదస్త్రాలు), మెయిల్ మరియు ముద్రకం డైరెక్టరీలు, తాత్కాలిక దస్త్రాలు(క్యాచీ)

లినక్స్ దస్త్ర వ్యవస్థ గురించి మరింత తెలుసుకోవడానికి ఈ దృశ్యాన్ని చూడండి...



దస్త్ర వ్యవస్థల గురించిన సమాచారం కొరకు ఈ లంకెను కూడా చూడండి.

10, ఏప్రిల్ 2012, మంగళవారం

గ్నోమ్ షెల్ పొడిగింతలు

గత కొద్ది కాలంగా లినక్స్ డెస్కుటాప్ పర్యావరణంలో గణనీయమైన మార్పులు చేసుకుంటున్నాయి. గ్నోమ్ 2.32 రూపాంతరం తరువాత విడుదలైన గ్నోమ్ షెల్ కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. ఎందుకంటే సాంప్రదాయక డెస్కుటాప్ పర్యావరణం వలె కాకుండా స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించే నిర్వాహక వ్యవస్థ వలె ఉంటుంది. ఏదిఏమైనప్పటికీ ఈ మార్పులు కొత్త తరం నిర్వాహక వ్యవస్థను రూపొందించుటకు దారితీసాయి.

గ్నోమ్ షెల్ పూర్తిగా వైవిధ్యంగా ఉంటుంది. ఇందులో మెనూలు మరియు ప్యానల్స్ వంటివి ఉండవు. ప్రతీరోజువాడే అనువర్తనాలను సరళంగా వాడుకునే రీతిలో రూపొందించారు. గ్నోమ్ పరియోజన అభివృద్ధి కూడా చాలా వేగవంతమైనది. సృజనాత్మకతతో గ్నోమ్ షెల్‌కు మరిన్ని హంగులు దిద్దుతున్నారు. గ్నోమ్ డెస్కుటాప్ పర్యావరణాన్ని క్రింది తెరపట్టులలో తిలకించవచ్చు.




గ్నోమ్ షెల్ కొరకు పొడిగింతల సైటును ప్రారంభించారు. ఈ పొడిగింతలు ఫైర్‌ఫాక్స్ లోని యాడ్-ఆన్స్ వలె ఉంటాయి. ఈ పొడిగింతలు ద్వారా మీ డెస్కుటాపుకి మరిన్ని ప్రయోజకాలను జతచేయవచ్చు.
గమనిక: ఈ పొడిగింతలు కేవలం గ్నోమ్ 3.2 లేదా ఆపై రూపాంతరాలలో మాత్రమే పనిచేస్తాయి. గ్నోమ్ షెల్ 3.0 లో పనిచేయవు.






గ్నోమ్ షెల్‌లో నాకు నచ్చిన కొన్ని పొడిగింతలు
ఈ పొడిగింతలను మీ వ్యవస్థ నందు స్థాపించుటకు https://extensions.gnome.org/ సైటుకు వెళ్ళి మీకు నచ్చిన పొడిగింతను ఎంచుకుని నొక్కినపుడు లోడైన పుటలో పైన ఎడమవైపున ఆఫ్ అనే బొత్తాం కనిపిస్తుంది
  

దానిపై నొక్కినట్లయితే స్థాపించమంటారా అని సంవాదం ప్రత్యక్షమవుతుంది. అపుడు install పై నొక్కండి.
స్థాపించిన పొడిగింతలను తొలగించడం ఎలా..?
మీ వ్యవస్థలో స్థాపించిన పొడిగింతలను తొలగించాలంటే స్థాపించిన పొడింత చిరునామాలో కనపడు ఆన్ బొత్తాంపై నొక్కి తొలగించవచ్చు.