21, ఫిబ్రవరి 2012, మంగళవారం

వియల్సీ 2.0 విడుదలైంది.

వీడియోల్యాన్ ఒక స్వచ్ఛంద సంస్థ, విరాలాలు మరియు స్వచ్ఛంద కార్యకర్తలచే నడుపబడుతున్నది. గత కొద్ది కాలంగా వియల్సీ నుండి ఎటువంటి నవీకరణ లేదు అందుకు కారణం వీయల్సీ సరికొత్త రూపాంతరంపై దృష్టిపెట్టింది. వందల కొలది ఉన్న లోపాలను స్థిరపరుచుటకు 160 మంది స్వచ్ఛంద కార్యకర్తలు కృషిచేసారు, వీరందరికీ ప్రత్యేక ధన్యవాదములు.
ప్రపంచ వ్యాప్తంగా (కేవలం సోర్సుపోర్జు నుండే 483,309,301 దింపుకున్నారు) అత్యధికంగా దింపుకున్న మధ్యమ ప్రదర్శకముగా వియల్సీకి రికార్డు ఉన్నది.

వియల్సీ 2.0 సరికొత్త హంగులతో మరియు అనేక విశిష్టతలతో మన ముందుకు వచ్చింది అవేంటో చూద్దాం.
సరికొత్త అంతరవర్తి
(మ్యాక్ నిర్వహణ వ్యవస్థలో వియల్సీ 2.0)
 ఈసారి మ్యాక్ నిర్వహణ వ్యవస్థ కోసం కాస్త ఎక్కువగా దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మ్యాక్ ఆపరేటింగ్ వ్యవస్థలో డివిడి ప్లేబ్యాక్ కొరకు సరైన సాఫ్టువేర్ లేనట్టుంది. మ్యాక్ ఓయస్ కొరకు రూపొందించిన అంతరవర్తి కూడా చాలా బాగా రూపొందించారు.

విశిష్టతలు:
  • RAR సంగ్రహాలలోవున్న బహుల మాధ్యమ దస్త్రాలను ప్రదర్శించగలదు
  • వీడియో అవుట్‌పుట్ రీతులను, బ్లూ-రే మాధ్యమ మద్ధతును మెరుగుపరిచారు
  • ఆండ్రాయిడ్, ఐఓయస్, OS/2 మరియు విండోస్ 64 లకు సాఫ్టువేరును రూపొందించారు
  • సరికొత్త ఆడియో, వీడియో ఫిల్టర్లు
  • HTTP లైవ్ స్ట్రీమింగ్ ప్లేబ్యాక్ మద్ధతు
  • పల్స్ ఆడియో ఇన్‌పుట్ మద్ధతు
  • మట్రోస్క (mkv) డీమక్సర్ అభివృద్ధి
  • థియొరా మరియు వోర్బిస్ కొరకు రియల్ టైమ్ ట్రాన్సుపోర్టు ప్రోటోకాల్ (RTP) నందు మద్ధతు
మరిన్ని విశిష్టతలు...

గత రూపాంతరానికి మరియు ప్రస్తుత రూపాంతరానికి సంబంధించిన మార్పులచిట్టాను ఇక్కడ చూడవచ్చు.

తెలుగు కూడా ఉన్నది...
 (డెబియన్ లినక్స్ నందు వియల్సీ మాధ్యమ ప్రదర్శకం తెలుగు తెరపట్టు)
సరికొత్త వియల్సీ మాధ్యమ ప్రదర్శకం 2.0 టూఫ్లవర్ రూపాంతరంలో తెలుగు కూడా అందుబాటులో ఉన్నది. కావున ఆసక్తి ఉన్నవారు వాడి మీ అభిప్రాయాలను పంచుకోవలసినదిగా మనవి. వీయల్సీని అనువదించుటలో తోడ్పడిన తెలుగుపదం గుంపుకు ధన్యవాదములు.

ఉబుంటు/డెబియన్ పంపణీలలో వియల్సీ 2.0 స్థాపించడం ఎలా..?
ఉబుంటు (12.04) మరియు డెబియన్ (SID)ల భాండాగారంలో ఇప్పటికే చేర్చారు కాబట్టి మీ వ్యవస్థను నవీకరిస్తే సరిపోతుంది.
ఉబుంటు 11.10 వాడుకరులైతే, క్రింద పేర్కొన్న పర్సనల్ ప్యాకేజీ ఆర్చీవ్ లను మీ సాఫ్టువేర్ మూలాలకి జతచేయండి.
    
   sudo add-apt-repository ppa:n-muench/vlc
   sudo apt-get update && sudo apt-get install vlc

పైన తెరపట్టులోని చిత్రం బ్లెండరు ద్వారా రూపొందించిన సింటెల్ చిత్రంలోనిది.

8, ఫిబ్రవరి 2012, బుధవారం

హైదరాబాదులో రిచర్డ్ స్టాల్‌మన్ ప్రసంగం...అందరూ ఆహ్వానితులే

తన పర్యటనలో భాగంగా గత కొద్ది రోజులుగా రిచర్డ్ మాథ్యూ స్టాల్‌మన్ (ఆర్ఎంఎస్) భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఇంతకూ ఎవరీ రిచర్డ్ స్టాల్‌మన్ అని మీరు అడగవచ్చు. ఈయనే ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. గ్నూ పరియోజనను, ఈమాక్స్ మరియు జిసిసి(గ్నూ కలెక్షన్ కంపైలర్), జిపియల్ (జనరల్ పబ్లిక్ లైసెన్స్) వంటి అనేక ప్రయోజనకరమైన వాటిని రూపొందించారు. ప్రస్తుతం ఫ్రీ సాఫ్టువేర్ ఫౌండేషనుకు అధ్యక్షులుగా ఉన్నారు. జిసిసి అనేది లినక్స్ మరియు బియస్డీ వంటి కంప్యూటర్ నిర్వాహణ వ్యవస్థలలో కంపైలరుగా వాడబడుతున్నది. అలాగే మనం నిత్యంవాడే ఫ్రీ సాఫ్టువేర్లలో అధికశాతం జిపియల్ (జనరల్ పబ్లిక్ లైసెన్స్) లైసెన్సుతో ఇవ్వబడతాయి.
అసలు మనలో ఎంతమంది సాఫ్టువేర్ స్థాపించేటపుడు లైసెన్సులు చదువుతాం...? ఏదో అడిగింది కదా అని టిక్ పెట్టి అగ్రీ పై నొక్కి ముందుకి కొనసాగుతాము అంతే తప్ప అందులో ఏముందో చదువుదాం అని మాత్రం అనుకోం ఎందుకంటే ఇంత పెద్దగావుంది ఏం చదువుతాము లే అయినా అవన్నీ మన దేశంలో ఎవడు పట్టించుకుంటాడు అని అనుకుంటాము. ఎందుకంటే మన దేశంలో పైరేటెడ్ సాఫ్టువేరుపై చట్టాలు లేకపోవడం వలన ఇలా ఉన్నాము అదే అమెరికాలో అయితే అంతే...
పొరపాటున మీరు అమెరికాలో ఉన్నారునుకుందాం, అంతర్జాల వేగం(మెగాబైట్లలో, వేగం బాగానే ఉంటుంది తరవాతే వాచిపోద్ది) అద్భుతంగా ఉంది కుమ్మేద్దాం అనుకుని ఏదైనా సినిమాను లేక సాఫ్టువేరును టోరెంటు లేదా దస్త్రాలు పంచుకునే సైట్ల నుండి దింపుకున్నారనుకోండి, అంతే వెంటనే మీ ఇంటికి బిల్లు వచ్చేస్తుంది. అలా ఉంటాయి మరి అమెరికాలో చట్టాలు, ఎందుకంటే అక్కడ అన్నిటినీ ట్రాక్ చేస్తారు. ఇలాంటి చట్టాలన్నీ అమెరికాలోనే ఉద్భవిస్తాయి.
ఇటీవలి సోపా మరియు పీపా అని రెండు బిల్లులను అమెరికా పార్లమెంటులో ప్రవేశపెట్టారు గానీ అదృష్టవశావత్తూ అవి పాసవ్వలేదు లేండి ఎందుకంటే ఆ బిల్లులపై విశ్వవ్యాపితంగా తీవ్రమైన నిరశనలు. ఎందుకంటే అవి అంతర్జాల స్వేచ్ఛను పూర్తిగా నిషేదించేలా రూపొందించబడ్డాయి.
 జనవరి 18న వికీపీడియా, గూగుల్, వర్డ్ ప్రెస్ వంటి అనేక సంస్థలు ఆ రోజు సేవలను పరిమితంగా నిలిపివేస్తూ తమ నిరసనను వ్యక్తం చేసాయి.
సోపా(స్టాప్ ఆన్ లైన్ పైరసీ యాక్ట్) మరియు పీపాలు(ప్రొటెక్ట్ ఐపీ యాక్ట్) వంటి చట్టాల వలన అంతర్జాల స్వేచ్ఛ ఎలా హరించుకుపోతుందనే విషయంపై డా. రిచర్డ్ స్టాల్‌మన్ ప్రసంగించనున్నారు.


భారతదేశ ఫ్రీ సాఫ్టువేర్ ఉద్యమంలో భాగమైన స్వేచ్ఛ సంస్థ ఆద్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నది.
ఎక్కడ: స్వేచ్ఛ కార్యాలయం, గచ్చిబౌలి క్రాస్ రోడ్స్.
ఎప్పుడు: ఫిబ్రవరి 8, 2012, మధ్యాహ్నం 3 గంటల నుండి...
ప్రవేశం: ఉచితం


అందరూ స్వేచ్ఛగా తరలిరావాలని కోరుకుంటున్నాము.